మట్టిపనికైనా మనోడు ఉండాలని వ్యాఖ్యానించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్.. రూ. 193 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అందులో భాగంగా రూ. 20 కోట్ల 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ రోడ్డు పనులు, రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్, రంగంపేటలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు కేటీఆర్. అనంతరం రూ. 15 కోట్లతో నాలాల నిర్మాణం, పబ్లిక్ గార్డెన్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, రూ. 8 కోట్లతో మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం, రూ. 2 కోట్లతో స్పెషల్ పార్కు, రూ. 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు, రూ. 1.50 కోట్లతో వరంగల్ పోతననగర్ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ. 80 లక్షలతో కేఎంజీ పార్కులో జాతీయ పతాకం, రూ. 4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు పనులు, హనుమకొండలో రూ. 22 కోట్లతో వరదనీటి కాల్వలకు రిటైనింగ్ వాల్స్, రూ. 15 కోట్లతో కల్వర్టులు, ఆర్అండ్బీఆర్ సీసీ రిటైనింగ్ వాల్స్‌కు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు బయలుదేరారు.
నర్సంపేటలో రూ. 43.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్ధాపన చేశారు. రూ. 50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనం రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన మెప్మా నూతన భవనం, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లో రూ. కోటి వ్యయంతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట బైపాస్ రోడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగించారు.
కేంద్రంలో బీజేపీ మాటలు తప్ప చేతలు కనిపించట్లేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో పథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ ముందడుగేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని అన్నారు కేటీఆర్. గతంలో రైతులకు పెట్టుబడి ఇచ్చిన సీఎంలు ఎవరైనా ఉన్నారా.? అని నిలదీశారు. రైతుబంధు కింద రైతులకు ఇప్పటికే రూ.50 వేల కోట్లు ఇచ్చామన్నారు. రుణమాఫీ పథకానికి దాదాపు రూ.25 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. కోతలు లేకుండా సాగుకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. త్వరలో వ్యవసాయ ఆధార, ఆహారశుద్ధి పరిశ్రమలు తీసుకువస్తామని స్పష్టం చేశారు.
కేంద్రంలో ప్రధాని మోడీ గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యికి పెంచితే.. ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్యాస్ ను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ తక్కువ ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు. కేంద్రం పెంచుతున్న నిత్యావసర ధరలతో రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజల కష్టాన్ని కేంద్రం సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు కేటీఆర్.