తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల అనౌన్స్ మెంట్ ఎప్పుడొచ్చిందో.. అప్పటి నుంచి కేంద్రంపై బీఆర్ఎస్ ఎటాక్ కొనసాగుతోంది. అటు బీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇరు పార్టీల మాటల యుద్ధంతో అటు నేషనల్ పాలిటిక్స్.. ఇటు స్టేట్ పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేశారు.
రష్యా, ఉక్రెయిన్ వార్ మొదలై ఏడాది అవుతోంది. అయితే.. యుద్ధం ప్రారంభం సమయంలో చాలామంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. ఎన్నో ప్రయాసలు పడి చివరికి వారు ఇండియాకు చేరారు. ఇదంతా.. మోడీ కృషే అని బీజేపీ ప్రమోట్ చేసుకుంటోంది. యుద్ధం ఆపేసి మరీ.. భారతీయులను దేశానికి తీసుకొచ్చామని చెప్పుకుంటోంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇదే విషయంపై మరోసారి వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
సోమవారం కర్ణాటకలోని ఉడుపిలో జరిగన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు నడ్డా. మోడీని ప్రశంసిస్తూ రష్యా, ఉక్రెయిన్ వార్ ఆపారని అన్నారు. దీంతో కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదాన్ని కూడా ప్రధాని పరిష్కరించలేకపోయారని సెటైర్లు వేశారు. అలాంటిది.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ఆపారంటే నమ్మాలా? అని ప్రశ్నించారు.
నడ్డా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. అంతేకాదు.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ఆపారనేది అవాస్తవమని.. వారి నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే వెల్లడించిందని గుర్తు చేశారు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు సార్ అంటూ చురకలంటించారు కేటీఆర్.