ప్రజా సంగ్రామ యాత్రలో కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బండి సంజయ్. కేటీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇది ఎలక్షన్ టైమ్ అనేలా యుద్ధం కొనసాగుతోంది. మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేస్తున్న ట్వీట్లు.. బీజేపీ నేతలను తెగ కవ్విస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తాజాగా మరోసారి ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. “మోడీ గారు.. మీరు గుజరాత్ కు మాత్రమే కాదు.. భారతదేశానికి ప్రధానమంత్రి. గత 8 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదు. డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలతో ఉన్న లక్షలాది మంది యువతి, యువకుల అవకాశాన్ని నిరాకరించారు. ఇప్పుడు తెలంగాణ యువత పరిస్థితి ఏంటి? పనితీరు బాగున్న రాష్ట్రం పట్ల ఈ వివక్ష ఎందుకు?” అంటూ ప్రశ్నించారు.
గురువారం గుజరాత్ లోని భరుచ్ లో నిర్వహించిన ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు మోడీ. వితంతువులు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆర్థిక సాయం అందించే నాలుగు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 100 శాతం లబ్ధిదారులకు అందుతున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తనదైన స్టయిల్ లో విమర్శలు గుప్పించారు.
ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు “100 శాతం ప్రజలకు చేరువవటం వల్ల వివక్షకు తెరపడింది. ఇప్పుడు వాటి ప్రయోజనాలు పొందేందుకు సిఫార్సులు అవసరం. అలాగే.. బుజ్జగింపు రాజకీయలకు సైతం ముగింపు పలికినట్లయింది. ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవటం వల్లే అర్హులు కాని వారు వాటి ప్రయోజనాలు పొందటం వంటివి జరుగుతున్నాయి” అన్నారు.