ప్రజా సమస్యలపై ప్రశిస్తున్న ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో పాటు పలు అంశాలపై చర్చించకుండా ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు కేంద్రం సస్పెండ్ చేయడం సిగ్గు చేటని అన్నారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతును ఎందుకు నొక్కుతోందని ఆయన అడిగారు.మోడీ సర్కార్ తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో మంగళవారం విపక్ష ఎంపీలు ఆందోళనలు చేశారు.
ఈ క్రమంలో ఉభయ సభల నుంచి 23 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్ సభ నుంచి నలుగురు, రాజ్యసభ నుంచి 19 మంది సస్పెన్షన్ కు గురయ్యారు.సస్పెండ్ అయిన వారిలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్రావులు ఉన్నారు.