సోమవారం నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. ప్రధాని మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతంలోని వార్తా కథనాలను తన ట్వీట్ కు జత చేశారు.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని.. ప్రతీ భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన హామీలను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ లో పేర్కొన్న మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అందజేయాలని కోరారు.
2022 బడ్జెట్ లో కేటాయింపులు వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు కేటీఆర్. బుల్లెట్ రైల్, భారత ఎకానమీ ఐదు ట్రిలియన్లకు రెట్టింపు, తదితర అంశాలపై ప్రధాని చేసిన ప్రకటనలను గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేరేలా, కేంద్రం ప్రణాళికలు సాకారమయ్యేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు మంత్రి.