అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్, సారంపల్లి, అంక్సాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఆయన చూపిన బాటలో అడుగులేసేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు కదిలిరావాలన్నారు.
దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. తాను నేడు మంత్రిగా ఉన్నారంటే దానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం అని వ్యాఖ్యానించారు కేటీఆర్. అంబేద్కర్ రాసింది భారతీయ రాజ్యాంగమని.. దేశంలో ఒకటే రాజ్యాంగం ఉందని.. దళితులకు ఒక రాజ్యాంగం, ఇతర కులాలకు ఇంకో రాజ్యాంగం లేదని అన్నారు కేటీఆర్.
రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉందని పేర్కొన్నారు కేటీఆర్. కానీ..నేడు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. వ్యవస్థల్ని కుప్పకూల్చిందెవరనేది మనమే ఆలోచించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రాజ్యంగ వ్యవస్థల్ని అడ్డంపెట్టుకుని అరాచకపాలన చేస్తోందెవరనేది ప్రజలే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని డిసంబర్ లోగా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచమే మనవైపు చూసే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నట్లు వివరించారు. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారానే రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.