టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పంచ్ లు ఏ విధంగా పేలుతున్నాయో చూస్తున్నాం. ఒకరిపై ఇంకొకరు బురద జల్లుకుంటున్నారు. మీదంటే మీది అవినీతి ప్రభుత్వం అని సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా? అని ఎదురుచూస్తూ వీలు చిక్కినప్పుడల్లా సెటైర్లు వేసుకుంటున్నారు.
యూపీ ఓటర్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో యోగికి ఓటు వేయకపోతే యూపీ వదిలి పారిపోవాల్సి వస్తుందని బెదిరించడం సరికాదన్నారు. బీజేపీలో మరో అద్భుతమైన హాస్యనటుడు బయటపడ్డారని చురకలంటించారు.
యూపీలో ఉండాలంటే యోగిని గెలిపించాలి… బీజేపీకి ఓటు వేయకపోతే మీ ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తారని రాజాసింగ్ అనడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్. అయితే మంత్రి వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. కేటీఆర్ ను ట్విట్టర్ మ్యాన్ అని అభివర్ణించారు.
తెలంగాణలో పెద్ద జోకర్ ఎవరో ప్రజలకు తెలుసన్నారు రాజాసింగ్. అసెంబ్లీలో మాట ఇచ్చి.. బయట అబద్దాలు చెప్పేది ఎవరో చూస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. యూపీలో యోగి సర్కార్ వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. తాను మాఫియా వాళ్లను, అక్రమార్కులను మాత్రమే హెచ్చరించానని.. అందర్నీ అన్నట్లుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు పని లేదని.. సోషల్ మీడియాలో బీజేపీ బురద జల్లించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. దేశ ద్రోహ్రులు, ధర్మ ద్రోహ్రుల ఇళ్లను ముమ్మాటికీ బుల్డోజర్లతో కూల్చేస్తామని మరోసారి స్పష్టం చేశారు రాజాసింగ్.