– టీఆర్ఎస్ లో మూడో ప్లేస్ కి కూకట్ పల్లి దొర?
– సంతోష్ రావుని పక్కన పెట్టేందుకు కేటీఆర్ స్కెచ్!
– ఇప్పటికే ప్రధాన ఆదాయ మార్గాల్లోకి కూకట్ పల్లి రావు?
– అడ్వటైజింగ్ బోర్డుల నుంచి ఐ అండ్ పీఆర్ వరకు అన్నీ అతనే!
– శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ లో భూ దందాలు
– మహానగరానికి షాడో మంత్రిగా ఎంట్రీ?
– టీన్యూస్ పగ్గాలు సైతం ఆ రావుకే?
క్రైంబ్యూరో, తొలివెలుగు:వెలమ దొరలు వారి సామ్రాజ్య విస్తరణకు పథకం పన్నారా? రోజురోజుకీ హద్దులు దాటిపోతున్నారా? ఇంట్లో గొడవలు పాలనపై చూపిస్తున్నారా? ఒకరికి చెక్ పెట్టేందుకు మరో దొరని తెరపైకి తీసుకొస్తున్నారా? అంటే అవుననే సమాధానం రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. ఒకప్పుడు కూకట్ పల్లి భూస్వాములుగా ఉండేది ఆ కుటుంబం. ఆదాయ మార్గం తప్ప రాజకీయం తెలియదు. కానీ.. మూడేళ్ల క్రితం ఆ కుటుంబం నుంచి ఓ పొలిటికల్ వారసుడు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా వచ్చారు. హైదరాబాద్ కి హార్ట్ లాంటి ఏరియా అయిన శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్న కూకట్ పల్లి, అప్ కమింగ్ ఫాస్టెస్ట్ గ్రోత్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో అంతా తానై నడిపిస్తున్నాడు. ఏ ల్యాండ్ ఇష్యూ అయినా.. ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఇట్టే క్లియర్ చేయిస్తున్నాడు. నమ్మిన బంటుగా ఉండటంతో అతనికి ప్రమోషన్ వచ్చింది. ఏకంగా సంతోష్ రావుకు చెక్ పెట్టేందుకు ఈ కూకట్ పల్లి రావుని రంగంలోకి దింపారు. పార్టీలో, ఇంట్లో మూడో ప్లేస్ కి ఈ రావుతో చెక్ పెట్టాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
కూకట్ పల్లి రావు ప్రస్థానం
తండ్రి, తాతలు కూకట్ పల్లి కావడం.. భూస్వాములుగా ఉండటంతో ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. తెలంగాణ ఉద్యమంలో లేరు. అవుట్ డోర్ యాడ్స్ నడిపించుకుంటూ ఎంజాయ్ చేసేవారు. టీఆర్ఎస్ పాలనలో వెలమ దొరలు ఆర్థికంగా మరింత బలపడేందుకు కూకట్ పల్లి రాజకీయాల్లోకి ఈయనను రంగంలోకి దింపారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన పేరు మీదనే ఉండే యాడ్స్ సంస్థ మరో చిన్న చిన్న హోర్డింగ్స్ ఉన్న లీడ్ స్పేస్ తో 2014లో కలిసిపోయింది. ఓ పెద్ద అడ్వటైజింగ్ ఎజెన్సీగా అవతారం ఎత్తింది. సంతోష్ రావుని కాదని సీఎం చేతిలో ఉండే ఐ అండ్ పీఆర్ లో భారీ మొత్తంలో ఈయన కంపెనీకి బడ్జెట్ కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. మీటింగుల్లో కూర్చొని అంతా తానై వ్యవహరించారు. అటు కేసీఆర్ ఇంట్లో గొడవలతో టీ న్యూస్ కి ఎండీగా కూడా ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తోంది.
అక్కడ అంతా తానై?
తొలివెలుగు క్రైంబ్యూరో మొదటి నుంచి ఫినిక్స్ అక్రమాలను బట్టబయలు చేస్తోంది. కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూములను ఎకరం రూ.60 కోట్లకు పైగా డిమాండ్ ఉన్నా.. రూ.10 కోట్లకే దొచేస్తున్నారు. అమ్మకానికి వీలుగాని భూముల కోసం ఢిల్లీకి దుబాయికి తిరుగుతూ.. హిందుజా కంపెనీకి వ్యక్తిగతంగా మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. శంషీగూడ సర్వే నెంబర్ 57లో లిటిగేషన్ లో ఉన్న ప్రభుత్వ భూమిని.. దేశ్ పాండే అనే వ్యక్తి దగ్గర నుంచి ఫినిక్స్ కి దొచిపెట్టేలా స్కెచ్ గీశారు. కోర్టులో గణేష్ గడియాల్ కేసు గెలిచారు. అతన్ని బెదిరింపులకు పాల్పడుతూ.. వందెకరాలు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బాచుపల్లిలోని భూములు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వివాదంలో ఉన్న భూమిని సెటిల్మెంట్ చేశారు. ఇవే కాకుండా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని వందల ఎకరాలు క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటన్నింటిపై తొలివెలుగు క్రైంబ్యూరో వరుస కథనాలు ప్రచురించబోతోంది.
మీడియాలోకి వచ్చేందుకు తహతహ!
ఇన్నాళ్లు టీ న్యూస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సంతోష్ రావుని పక్కన పెట్టేందుకు ఇంట్లో పోరు ఎక్కువైందట. దీంతో కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంతోష్ రావు… కేటీఆర్, హారీష్ రావు, కవితతో పాటు పోటీ పడి మరో ఆకు ఎక్కువే సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉంటే.. కేటీఆర్ కి ఎసరు తెస్తారని గమనించిన మంత్రి.. కూకట్ పల్లి రావును మూడో ప్లేస్ భర్తీకి తీసుకొచ్చారని తెలుస్తోంది. దీంతో టీ న్యూస్ ఈయన చేతిలోకి వెళ్లబోతోందని సమాచారం. ఇప్పటికే మీడియాను ఎలా మ్యానేజ్ చేయాలో ఇద్దరు మీడియా ఓనర్స్ తో భేటీ అయ్యారట. ఐ అండ్ పీఆర్ లో అన్నీ తానై చూసుకుంటానని.. ఇక నుంచి ప్రభుత్వానికి తన ద్వారా కమ్యునికేట్ కావాలని చెప్పినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ సిగ్నల్స్ అడ్వటైజింగ్ లో టెండర్ల గోల్ మాల్ ఎలా జరిగింది. కూకట్ పల్లి రావు భూ భాగోతాలు ఎలా ఉన్నాయో పూస గుచ్చినట్లు మరో కథనంలో చూద్దాం.