– కేటీఆర్ క్లాసులతో నష్టమా? లాభమా?
– డేంజర్ జోన్ లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు!
– ముందస్తుకు వెళ్లినా మునుగుడు తప్పదా?
– పెరిగిన ప్రజావ్యతిరేకత కొంప ముంచనుందా?
– సొంత తప్పిదాలే కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్నాయా?
– రాజకీయ పండితుల విశ్లేషణ
దళిత ముఖ్యమంత్రి అన్నారు.. చేయలేదు. మూడెకరాల భూమి అన్నారు.. ఇవ్వలేదు. పోడు భూములకు పట్టాలన్నారు.. ఇచ్చింది లేదు. ఇంటింటికీ ఉద్యోగం ఎటు పోయిందో తెలియదు. రైతులకు ఉచిత ఎరువులు అమలు కానేలేదు. ఇలా కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలు, అమలుకాని తీరును లెక్కెస్తే లిస్టు చాంతాడంత అవుతుంది. మరి.. ఇంత జరిగాక కూడా ప్రజలు ఇంకా కేసీఆర్ నే నమ్ముతున్నారా? అంటే ఈసారి మాత్రం పక్కాగా లేనే లేదంటున్నారు రాజకీయ పండితులు. అందుకే కేటీఆర్ జిల్లాల పర్యటనల్లో పార్టీ నాయకులకు క్లాసులు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదని కూడా అంటున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర అప్పులు చాలా తక్కువే. ఇప్పుడవి 4 లక్షల కోట్లకు పైకే చేరాయి. కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టులు కట్టినా వాటి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా ప్రజల సొమ్మును పక్కదారి పట్టించారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అటుచూస్తే హామీల అమలు అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత రావడం కామనే. మరి.. దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి గాని.. ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి వేధిస్తే నష్టమే జరుగుతుందని కేసీఆర్ అంచనా వేయకపోవడం పెద్ద మిస్టేక్ గా చెబుతున్నారు విశ్లేషకులు. ఇన్నేళ్లలో అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం హామీల అమలు జరగకపోగా.. ఆ కేసు.. ఈ కేసు అంటూ బెదిరింపులకు పాల్పడడం కూడా అని విశ్లేషణ చేస్తున్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కార్ పేరెత్తితే జనం తన్నేలా ఉన్నారనే దాన్ని ప్రతిపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలకు కేటీఆర్ క్లాసులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చేయాల్సిందంతా మీరు చేసి మమ్మల్ని అంటే ఏం లాభమని గులాబీ వర్గాల్లో ఓ ఇన్నర్ ఫీలింగ్ కూడా రెయిజ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు ఎక్కడ కనిపించినా ఏదో ఒక సమస్యపై గ్రామాల్లో జనాలు నిలదీస్తున్నారు. కాన్వాయ్ లను అడ్డుకుని కడిగిపారేస్తున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? కేసీఆర్, కేటీఆర్ కాదా? అనే చర్చ కూడా జరుగుతోంది. పైగా ప్రతిపక్షం లేకుండా చేద్దామని ఎవరినిబడితే వారిని పార్టీలోకి తీసుకొచ్చి కుమ్ములాటలకు కారణమైంది ఎవరని కూడా మాట్లాడుకుంటున్నారు.
చేయాల్సిందంతా చేసి..ఇప్పుడు క్లాసులు తీసుకోవడం వల్ల నష్టం నుంచి పార్టీ కోలకోవడం కష్టమని భావిస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ఇప్పటికే చాలామంది నేతలపై పీకే సర్వేల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. పైగా పీకే కనుసన్నల్లోనే ఈసారి సీట్ల సర్దుబాటు ఉంటుందని టాక్ నడుస్తోంది. కచ్చితంగా ఓ 40 మంది సిట్టింగులకు బెర్త్ కన్ఫామ్ కాదనే వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్నింగులు ఇవ్వడం వల్ల నేతలు పార్టీని వీడే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. చాలామంది నేతలు బీజేపీ, కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం ఉంది. సీట్ల విషయంలో ఓ క్లారిటీ వస్తే టీఆర్ఎస్ లో మార్పులు గట్టిగానే ఉంటాయనే టాక్ నడుస్తోంది. ఎన్నికల నాటికి కేసీఆర్ కు షాకిచ్చేందుకు బడా నేతలే రెడీగా ఉన్నారని సమాచారం.