తెలంగాణకు కర్త,కర్మ,క్రియ అన్నీ కేసీఆరేనన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 ఏళ్లలో పార్టీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొందని.. కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణంగానే ఈ స్థాయికి వచ్చిందని చెప్పుకొచ్చారు. పదమూడేళ్లపాటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారని.. .వారి కోసం 16.11 కోట్ల రూపాయలు ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీకి చెల్లించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన బీమా చెక్కును యునైటెడ్ బీమా సంస్థకు ఆయన అందించారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ఎమ్మెల్యేలు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
కేసీఆర్ పార్టీ స్థాపించిన ముహూర్తం మరో వందేళ్ల పాటు పార్టీని బలంగా ఉండేలా చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ దేశంలోనే అజేయశక్తిగా ఎదిగిందని.. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు తిరుగు లేని రాజకీయశక్తి అంటూ పోల్చారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు పదవులు దక్కడం టీఆర్ఎస్ పుణ్యమేనన్న కేటీఆర్..కేసీఆర్ మీద మాట తూలేముందు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.