ఖమ్మం కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ధి.. ఇతర కార్పొరేషన్లకు ఆదర్శం కావాలన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.11.75 కోట్లతో లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన, చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటైన్, రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లాగా చేయాలన్నదే మంత్రి పువ్వాడ అజయ్ లక్ష్యమని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే నిలువెత్తు అభివృద్ధి అని కొనియాడారు. కే అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్ లు అని కేసీఆర్ కు కొత్త ఆర్ధాన్ని చెప్పారు కేటీఆర్. టీఎర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువును ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. చెరువుపై నిర్మించిన తీగల వంతెనను చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నారని తెలిపారు.
మంచి పనులు జరిగేటప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటం సహజమేనని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపించేందుకు వీల్లేకుండా పనులు చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ.. కొందరు చిల్లర కూతలు కూస్తున్నారని విరుచుకుపడ్డారు కేటీఆర్. ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ.. ఖమ్మంలో ఒక నేతను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు బట్ట కాల్చి మీదేసినట్లు అతని చావును మంత్రి పువ్వాడ మీదకు నెట్టే ప్రయత్నాలు చేశారని విమర్శలు గుప్పించారు.
దేశంలో 25 కోట్ల మంది భారతీయ ముస్లిం సొదరులు నిరసన చేయడానికి కారకులెవరని నిలదీశారు కేటీఆర్. దేశంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? దీనికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. కేవలం కులం, మతం పేరుతో ఓట్లు దండుకునేందుకు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పచ్చగా ఉన్న దేశంలో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు కేటీఆర్.