నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్ కు లేఖ రాశారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగినా చెప్తారని లేఖలో పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో చేనేతపై పన్నువేసిన మొదటి ప్రధాని మోడీ అని ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ టెక్స్ టైల్ రంగంపై మోడీ పన్నుల భారం వేశారని మండిపడ్డారు.
ప్రధాని నిర్ణయాల వల్లే టెక్స్ టైల్ రంగం కునారిల్లుతోందని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా టెక్స్ టైల్ రంగానికి కేటాయింపులు చేస్తుంది తెలంగాణ సర్కారే అని పేర్కొన్నారు. ప్రత్యేక పొదుపు పథకంతో నేతన్నకు చేయూతనిస్తున్నామని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ముంబై, బీవండి, సూరత్ నుంచి తెలంగాణకు నేత కార్మికులు తిరిగివస్తోంది నిజం కాదా? అని నిలదీశారు. కేంద్రం బీమా ఎత్తివేస్తే.. తాము ప్రత్యేకంగా నేతన్నకు కల్పిస్తున్నామని చెప్పారు. నేతన్నలకు ఉన్న బీమా ఎత్తివేసిన కేంద్రం నిర్ణయంపై బండి మాట్లాడాలని డిమాండ్ చేశారు. నేతన్నలపై నిజమైన ప్రేమ ఉంటే పార్లమెంట్ లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.
Advertisements
దేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు కేంద్రం నుంచి అందిన సాయంపై సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు.. చేనేతల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ.. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుపై బండి సంజయ్ ఢిల్లీలో కొట్లాడాలన్నారు కేటీఆర్.