ఎల్బీ నగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ముందు అభివృద్ది.. తరువాతే రాజకీయాలని చెప్పిన ఆయన హైదరాబాద్ నగరం శర వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. ప్రతి ఏడాది 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ కు వచ్చి స్థిర పడుతున్నారని..వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం
చేపడుతుందన్నారు.
985 కోట్లతో నాలాల పనులు జరుగుతున్నాయన్నారు. ఇక మూసీ నది పై త్వరలోనే 14 కొత్త బ్రిడ్జిలను కట్టబోతున్నామని కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 84 లక్షలతో జంతువుల కోసం స్మశాన వాటికను నిర్మించామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆటో నగర్లో ప్లవర్ గార్డెన్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు మంత్రి కేటీఆర్.
ఎల్బీనగర్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. అయ్యప్ప కాలనీలోకి ఇక పై వరద నీరు రాదన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉండే పలు మున్సిపాల్టీల్లో..220 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామన్నారు.
అయితే కేటీఆర్ పర్యటనతో ఎల్బీనగర్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. కేటీఆర్ రావడానికి గంట ముందే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరో వైపు కేటీఆర్ వెళ్తున్న మార్గంలో.. చిన్నపాటి బీజేపీ వాల్ పోస్టర్లు కూడా కనిపించకుండా.. అన్నింటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించేసింది.