హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. రామాలయం రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాలుగవ అంతస్తుతో పాటు మూడవ అంతస్తు కూడా కూలిపోయింది. నిర్మాణం సమయంలో నాలుగవ స్లాబ్ పైన నిర్మాణ పనుల్లో పదిమంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు చనిపోయారు. ప్రస్తుతం ఒకరి మృతదేహాన్ని ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే పలువురికి గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ఈ భవనానికి జీ ప్లస్ 2 పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులను నిర్మిస్తున్నాడు లక్ష్మణ్ రావు అనే నిర్మాణ దారుడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
భవన యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. బిల్డింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్న తొందరే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నాసిరకం పనులే ప్రధాన కారణమని పేర్కొన్నారు పోలీసులు.