రాజకీయాల్లో తన తండ్రి దేవే గౌడ తర్వాత అంతటి మార్గదర్శి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమార స్వామి అన్నారు. కేసీఆర్‌తో తనకు గ్యాప్ వచ్చిందన్న వార్తలపై ఆయన స్పందించారు.
ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం వల్ల ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందుతోందని ఆయన తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో తాము విజయం సాధించాక సీఎం కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో అభివృద్ధిని బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి నెట్టేశాయని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు తెలంగాణ సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించనున్నారు. అదే రోజు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభకు తమిళనాడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్‌తోపాటు మరికొందరు నేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది. సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం వీరంతా హాజరు కానున్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో వారు పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ సభకు కౌంటర్‌గా ఈ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం, స్టాలిన్, జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, కుమారస్వామి హాజరు కానున్నారు.