ఒకప్పుడు పెళ్లి అంటే కుర్రాళ్లు చక్కగా గడ్డం గీసుకుని అందంగా కనిపించేవారు. తరువాత తరువాత ట్రెండ్ మారడంతో లైట్ గా గడ్డం ఉంచుకొని పెళ్లి పీటలెక్కుతున్నారు. కొన్ని సర్వేలు కూడా గడ్డం పెంచుకున్న యువకులు అందంగా , ఆకర్షణీయంగా కనిపిస్తారని చెప్పడంతో అదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు.
అయితే రాజస్థాన్ లోని ఒక ఊరిలో మాత్రం ఈ ట్రెండ్ వర్కౌట్ కాలేదు. ఒకవేళ కాదని ఎవరైనా గడ్డం పెంచితే మాత్రం వారిని పెళ్లికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లో ఈ విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆ గ్రామంలో మే 5 వ తేదీన కుమావత్ సామాజిక వర్గానికి చెందిన వారు సామూహిక వివాహలు చేయడానికి సిద్దమవుతున్నారు.
దాని కోసం ఇప్పటి వరకు 11 మంది జంటలు నమోదు చేసుకున్నాయి కూడా. అయితే ఈ వర్గం వారు గ్రామ పెద్దలతో కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి పెళ్లి కొడుకు క్లీన్ షేవ్ లో మాత్రమే కనిపించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయానికి జైపూర్, టోంక్ , సవాయి, మాధోపూర్ ప్రజలు సైతం మద్దతు తెలిపారు. ఈ మధ్య కాలంలో యువత వేషధారణ చిత్రవిచిత్రంగా ఉంటుందని చివరికి పెళ్లిలో కూడా సంప్రదాయాలు పాటించడం లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. తమ సంప్రదాయం ప్రకారం వరుడు క్లీన్ షేవ్ తో ఉండాలని వారు పేర్కొంటున్నారు.
నేటి యువత పీటల మీద కూడా పెద్ద పెద్ద గడ్డాలతో కనిపిస్తున్నారని, అది తమ సాంప్రదాయానికి పూర్తి విరుద్దమని గ్రామ పెద్దలు మండిపడ్డారు. అందుకే గడ్డం ఉండకూడదన్న నిర్ణయాన్ని కుమావత్ కమిటీ తీసుకుంది. ఈ నిర్ణయానికి పెద్దలు మద్దతిస్తుంటే యువకులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు.ఇలాంటి రూల్స్ పెట్టి తమ స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహరం నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.