కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అనుచరుడు ఇంతియాజ్‌బాషా.. మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించడమేగాకుండా ఓ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడడం వివాదానికి దారితీసింది. శనివారం సాయం త్రం ఇంతియాజ్ 20 మందితో కలిసి తమపై దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
కర్నూలు నగరంలోని పాతబస్టాండు అర్బన్ బ్యాంకు ఎదురుగా చింత కృష్ణయ్య కుమారుడు చింత నరసింహయ్య(ఇంటి నంబరు 67/53) కుటుంబం 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. ఈ ఇంటికి తూర్పు దిక్కున మున్సిపాలిటీ స్థలం ఉంది. . ఈ స్థలంలోంచే నరసింహయ్య కుటుంబం రాకపోకలు సాగిస్తోంది. అయితే.. ఇంతియాజ్ దానిని ఆక్రమించి చిన్న గుడిసె నిర్మించి, గుడిసె ముందు నాపరాయి ఫ్లోరింగ్ చేయించారు. ఈ నేపథ్యంలో బాషా ఆక్రమించుకున్న మున్సిపాలిటీ స్థలాన్ని నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోరుతూ నరసింహయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇంతియాజ్ కూడా హైకోర్టుకు వెళ్లారు. కానీ, తహసీల్దారు కార్యాలయం నుంచి తప్పుడు పత్రాలు సృష్టించారనే అభియోగంతో ఇంతియాజ్ పిటిషన్‌ను 2017 ఆగస్టు 18న హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నారనే ధీమాతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధిక్కరించిన ఇంతియాజ్ గుడిసెను తొలగించి ఆ స్థలంలో రెండస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
నరసింహయ్య కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు శశికళ శనివారం పనులు అడ్డుకునే ప్రయ్నతం చేశారు. దీంతో సుమారు 20 మందితో కలిసి ఇంతియాజ్ వీరిపై దాడి చేశారని బాధితులు తెలిపారు. తాము పోలీస్ స్టేషన్‌కు వెళితే దాడి చేసిన వారితోపాటు తమపై కూడా కేసు నమోదు చేశారని తెలిపారు. తమ సమస్యకు పరిష్కారం చూపించాలని వారు కోరుతున్నారు