బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్‌ను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా కేంద్రం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన అపాయింట్ మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన లేఖను ట్విట్టర్‌లో ఆమె షేర్ చేశారు.
తనను ఆ పదవికి నామినేట్ చేసినందుకు ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప బాధ్యతను తాను నిర్వర్తించగలనని తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలని అని చెప్పారు. ప్రధాని మోడీ పాలనలో మహిళా శక్తి వెలుగొందుతోందన్నారు.
మహిళా శక్తిని రక్షించేందుకు తాను మరింత కృషి చేస్తానన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా సేవలు అందించేందుకు తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానన్నారు. ఖుష్బూకు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతోపాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్ లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖుష్బూ తమిళ , తెలుగు భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 2010లో డీఎంకేలో చేరారు. ఆ పార్టీతో విభేదాలు రావడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2020 వరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆమె పనిచేశారు. అనంతరం ఖుష్బూ బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.