మునుగోడు ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్టు ప్రచారం సాగిస్తున్నాయి పార్టీలు. ఓవైపు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ.. ఇంకోవైపు ఒకరిపై ఒకరి తిట్టిపోసుకుంటున్నారు నేతలు. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దీనికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై టీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం నామినేషన్ పత్రాలను అధికారికి సమర్పించారు టీఆర్ఎస్ అభ్యర్థి.
ఈనెల 7న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగుస్తోంది. ఇప్పటికే బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కూసుకుంట్ల కూడా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చివరి రోజు నామినేషన్ వేయనున్నారు.
నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కూసుకుంట్ల. తాను పక్కా లోకల్ అని.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్ అని గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లకు అమ్ముడు పోయాడని ప్రజలే అంటున్నారని చెప్పారు. తన సొంత ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిన ఆయనకు బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానన్న ఆయన.. ఈ ప్రాంత ప్రజలకు సేవకుడిగా నిలుస్తానని తెలిపారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నానని గుర్తు చేశారు కూసుకుంట్ల.
ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికలో 32 మంది అభ్యర్థులు.. 52 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ జన సమితి తరఫున పల్లె వినియ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ నుంచి ఆందోజు శ్రీనివాసచారి పత్రాలు సమర్పించారు. ఇక రైతుల పక్షాన ప్రముఖ డాక్టర్ కోమటిరెడ్డి సాయితేజ్ రెడ్డి చండూరు బస్టాండ్ నుంచి ఎద్దులబండితో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు.