ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు రెండేళ్లుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల న్యాయస్థానం టూ దైవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, కువైట్ లోని తెలుగువారు కూడా రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. కువైట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి దివాకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మందితో సోమవారం పాదయాత్ర నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాణాధారమైన భూమిల్ని త్యాగం చేసిన రైతులకు నైతిక మద్దతు తెలియజేస్తున్నామని దివాకర్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా.. యువతకు ఉద్యోగాలు లభించాలన్నా.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీలో సరైన అవకాశాలు లేకపోవడంతో తామంతా కువైట్ రావాల్సి వచ్చిందని.. అమరావతి నిర్మాణం జరిగి ఉంటే.. ఇప్పటికే పెట్టుబడులు వచ్చేవని అన్నారు. రైతులు చేస్తున్న మహాపాదయాత్రపై ఆంక్షలు విధించడం సరికాదని ఆయన మండిపడ్డారు.