దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవీపీని వైఎస్ ఆత్మగా పిలుస్తారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య అలాంటి సంబంధం ఉండేది. అయితే వైఎస్ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు జగన్ తో కేవీపీకి సంబంధాలు లేవు. తాజాగా శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో కేవీపీకి ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రశ్నల నుంచి తాను ఎంతో కాలం దూరం జరగలేనని.. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. మరో రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు కేవీపీ. దీంతో కేవీపీ ఏం చెబుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అనంతరం కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల పాటు రాహుల్ గాంధీకి గడువు ఇచ్చినప్పటికీ సూరత్ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చిన రెండో రోజే అనర్హత వేటు వేసిందని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్తంగా అంతా స్పందిస్తున్నారని.. కానీ ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం ప్రమాదకర పద్ధతులను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని విమర్శించారు.
2018లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని తాను వ్యతిరేకించానని.. కానీ ఈ విషయం బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదని చెప్పారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నోరు విప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని.. ప్యాకేజీ చాలంటూ చంద్రబాబు ఏపీకి మరణ శాసనం రాశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం చంద్రబాబు వల్లే సాధ్యమైందని అన్నారు. సెల్ ఫోన్లు తెచ్చిన సమర్ధుడు.. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు కేవీపీ రామచంద్ర రావు.