తెలంగాణ లో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం జి కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవాహిస్తున్న పాలేరు వాగులో 22 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు.
ఒడ్డున పడే మార్గం లేక అలాగే వాగు మధ్యలో ఉండిపోయారు.ఎవరైనా సాయం చేస్తారన్న ఆశతో వారంతా కలిసి వాట్సాప్ సెల్ఫీ వీడియో తీసి గ్రూపుల్లో పోస్ట్ చేశారు. దీంతో వారు వాగు మధ్యలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసింది.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే విషయాన్ని ఎన్డీఆర్ ఎఫ్ బృందం వారికి తెలపగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని రెండు విడతల్లో 14 మందిని రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కూలీలంతా మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్ల మండలం చౌళ్ల తండాకు చెందినవారు. వ్యవసాయ పనుల నిమిత్తం సూర్యాపేటకు వచ్చినట్లు సమాచారం. వరి నాట్లు వేసేందుకు వెళ్లి పాలేరు వాగులో చిక్కుకున్నట్లు కూలీలు తెలిపారు.