అబ్బా.. ఈ రోజు కూడా జిమ్ చేయాలా..? నిన్న చేశా కదా.. ఈరోజుకి మానేద్దాం… అనే వారు మనలో చాలా మందినే ఉంటారు. అలాంటి వారి కోసం ఓ శుభవార్త. దీనిని చదివితే యురేకా అంటూ ఎగిరి గంతులేస్తారు. వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో.. వాటిని ఓ టాబ్లెట్ రూపంలో అందించేందుకు శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు.
సాధారణంగా మనలో చాలామంది ప్రధానంగా బాధపడే విషయం ఊబకాయం. దానిని తగ్గించుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గుతుంటారు. అంతేకాకుండా వారికి ఆకలి కూడా నియంత్రణలోనే ఉంటుంది. జిమ్ చేసినప్పుడు సీఎస్‌డీపీ2 అనే ఎంజైమ్ వల్ల లాక్-ఫె అనే ప్రత్యేక అమైనో ఆమ్లం ఎక్కువగా విడుదలవుతుండటమే దీనికి కారణమని తెలుస్తోంది.
దానికి ప్రధానంగా ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. బరువు ఎక్కువగా ఉన్న ఎలుకలు 50 శాతం వరకు తక్కువ ఆహారం తీసుకోవడానికి అది దోహదపడుతున్నట్లు నిర్థారించారు. అనంతరం కొన్ని ఎలుకలకు కృతిమంగా లాక్-ఫె ను అందించగా… వ్యాయామం చేసిన తరహాలోనే వాటిలో ప్రయోజనాలు కనిపించాయి.
భవిష్యత్తులో మానవుల్లోనూ లాక్ ఫె తరహా ఆమైనో ఆమ్లాన్ని అధికంగా ఉత్పత్తి చేయగల మాత్రలను తయారు చేసేందుకు కృషి చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు.