బిహార్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీలో అధికార మహా ఘట బంధన్ కూటమి ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు లడ్డూలు విసురుకున్నారు.
ఇంతకు ఏం జరిగిందంటే… ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీలకు ఈ రోజు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల వ్యక్తిగత పూచికత్తుపై వారికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనిపై ఆర్జేడీ ఎమ్మెల్యేలు సంబురాలు చేసుకున్నారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఆర్జేడీ సభ్యులు పంపిణీ చేసిన లడ్డూలను బీజేపీ ఎమ్మెల్యేలు విసిరికొట్టారు.
ఈ క్రమంలో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యే పట్ల వారు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.