జీవితమే ఒక పరీక్ష.. అలాంటి జీవితంలో ఎదుర్కొవాల్సిన పరీక్షలు ఎన్నో. ఇప్పుడు ఇలాంటి ఘటనలే మీడియా కళ్లకు చిక్కాయి. రాష్ట్రంలో నిర్వహిస్తున్న టేట్ పరీక్ష తల్లులకే కాదు చిన్న పిల్లలకు సైతం పరీక్షగానే మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలతో పరీక్ష కేంద్రాలకు హాజరైన తల్లులు సెంటర్లలో పరీక్ష రాస్తుంటే.. సెంటర్ బయట చెట్టుకు కట్టిన చీర ఊయలలో చిన్నారులు ఆడిస్తున్నారు బంధువులు.
రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్ష కేంద్రాలకు తల్లులు పరీక్ష రాయడానికి కొంతమంది మహిళలు చిన్న పిల్లలతో హాజరయ్యారు. వారిని ఆడిపించడానికి బంధువులు నానా తంటాలు పడుతున్నారు. నెలల వయసులో ఉన్న పిల్లలు తల్లి పాలకోసం ఏడుస్తుంటే వారిని సముదాయించలేక అవస్థలు పడుతున్నారు.
మహబూబాబాద్ పట్టణంలో టెట్ పరీక్ష కేంద్రానికి వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను చెట్టుకు ఊయల కట్టి ఆడించమని చెప్పి పరీక్ష కేంద్రంలోకి వెళ్లింది. తల్లిపాల కోసం ఏడుస్తున్న పసి పాపను ఆడించలేక బంధువులు అవస్థలు పడుతుంటే.. అక్కడే ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ ఆ పసికందును ఆడిస్తున్న దృష్యాలు కెమెరాకు చిక్కాయి.
పాలడబ్బా పట్టి సొంత తల్లిలాగా పాపను ఆడిస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కఠినంగా ఉండేది కొలువే కానీ.. తల్లి ప్రేమ కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో పలువురు లేడీ కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.