లక్షద్వీప్ పరిపాలనా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇకపై ప్రతి బుధవారం ప్రభుత్వ ఉద్యోగులందరూ ‘ సైకిల్ డే’ను పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
లక్షద్వీప్ కాలుష్య నియంత్రణ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగివున్న ఉద్యోగులను సైకిల్ డే నుంచి మినహాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. కొంత మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, మరికొందరు వచ్చే బుధవారం వరకు సమయం కోరారు.
దీనిపై కలెక్టర్ ఎస్ అస్కర్ అలీ మాట్లాడుతూ… తాము లక్షద్వీప్ లో పర్యావరణ అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇది వాహన కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఉద్యోగుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు.