కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత సమస్య జటిలమవుతుండగా లక్షద్వీప్ ఎంపీ.. పీపీ. మహ్మద్ ఫైజల్ అనర్హత అంశం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఓ క్రిమినల్ కేసులో తనను దోషిగా ప్రకటిస్తూ జారీ అయిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు లోక్ సభ సచివాలయం నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని జస్టిస్ కెఎం. జోసెఫ్, జస్టిస్ బీవీ. నాగరత్నతో కూడిన బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ప్రాథమిక హక్కు అవుతుందా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
అయితే ఈ పిటిషన్ ను మంగళవారం కోర్టు చేపట్టే అవకాశం లేనందున రేపటికి లిస్ట్ లో పెట్టాలని పిటిషనర్ తరఫు అడ్వొకేట్ రితిన్ రాయ్ .. కోర్టును కోరారు. ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన జరిగినప్పుడే రాజ్యాంగం లోని 32 అధికరణం కింద ఓ పిటిషన్ విచారణార్హం అవుతుందని బెంచ్ స్పష్టం చేసింది.
ఈ కేసులో పిటిషనర్ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్.. 2009 లో జరిగిన ఓ హత్య యత్నం కేసులో నిందితుడు. ఈ కేసులో గత జనవరి 11 న ఇతనికి మరో ముగ్గురికి లక్షద్వీవ్ లోని సెషన్స్ కోర్టు వీరిని దోషులుగా ప్రకటించి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ ద్వీపం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఈయనను సభ్యత్వానికి అనర్హునిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈసీ ఇక్కడ ఉపఎన్నికకు ఆదేశించింది. అయితే జనవరి 25 న కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫైజల్ దోషి అన్న తీర్పును నిలిపివేసింది. మరో ఏడాదిన్నరలో లోక్ సభ కాలపరిమితి ముగియనుండగా ఉప ఎన్నికకు ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం వృధా అని జస్టిస్ కురియన్ థామస్ పేర్కొన్నారు.