– నిధులు మళ్లించేందుకే డైరెక్టర్స్
– కేసులు కావడంతో ఏడుగురు రాజీనామా
– తొలివెలుగు కథనాలతో అంతా తారుమారు
– 2018లో కాంగ్రెస్ కి ఆర్థిక సాయం!
– పట్టుబడినా.. లోతుగా లేని దర్యాప్తు
– ఈడీ వద్దకు పూర్తి ఆధారాలు
– చేతులెత్తేయనున్న ఖద్దర్, ఖాకీలు!
క్రైంబ్యూరో, తొలివెలుగు:దేశంలో డబ్బులు పడేస్తే.. ఏ పనైనా ఇట్లే అవుతుందని చెప్పడానికి సాహితీ కేసు ఒక్కటి చాలు. తాను జైలుకు వెళ్తేనే అంతా సెట్ అవుతుందని తెలుసుకుని కటకటాల్లోకి వెళ్లాడు లక్ష్మీ నారాయణ. 15 రోజుల్లో బయటకు వస్తాననే ధీమా అతనిది. బడాబాబులైన ఖద్దర్, ఖాకీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడట. 2,800 కుటుంబాలకు పంగనామం పెట్టేందుకే జైలు అంటూ ఉపాన్యాసాలు ఇచ్చాడని అంటున్నారు. పాత డైరెక్టర్స్ డబ్బుల వ్యవహారంలో ఎలా వ్యవహరించాలో చెప్పి వెళ్లినందుకు ఈ వ్యవస్థకి హ్యాండ్సప్ చెప్పాలి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలైన కొండా మురళి, వద్దిరాజు రవిచంద్రకి ఎన్నికల సొమ్ము ఈ కంపెనీ నుంచే వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, అప్పటి ఏసీపీకి ఓ పది కొట్టేసి దర్యాప్తులు లేకుండానే ప్రత్యక్షంగా పట్టుబడ్డ వారిపై మాత్రమే చార్జీషీట్ దాఖలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని అప్పటి పీసీసీ చెప్పిన వారికి కాదనకుండా డబ్బు సహాయం చేసినవారి లిస్ట్ ల్యాప్ టాప్ లో ఉండేది. కానీ, ఒక్క సాక్ష్యాధారం లేకుండా చేసి సీసీఎస్ పోలీసుల వద్ద లొంగిపోయాడు లక్ష్మీనారాయణ. ఇది పోలీస్ వెర్షన్ లో అరెస్ట్. టీటీడీ బోర్డ్ మెంబర్ గా రాజీనామాకు సీసీఎస్ లోనే సంతకాలు జరిగాయంటే.. ఎంత ప్లాన్ గా వెళ్లారో అర్థమౌతోంది.
రాజీనామాలే అంతిమ పరిష్కారం?
సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2015లో ఏర్పాటు చేశారు. మొత్తం 12 మంది డైరెక్టర్స్ గా ఉండేది. అందులో కేసులు అవుతుండగానే ఏడుగురు రాజీనామా చేశారు. వివిధ కంపెనీల్లో 18 మందితో కలిసి బిజినెస్ లు చేశాడు లక్ష్మీ నారాయణ. వీరందరికి నిధులు మళ్లించాడా.. ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ చేశారనేది సీసీఎస్ పోలీసుల కస్టడీలో తేలనుంది.
లక్ష్మీ నారాయణతో బిజినెస్ చేసింది వీళ్లే!
1. సుబ్బారావు వెంకట శివ పానెం
2. శ్రీనివాసరావు కొడాలి
3. శ్రీనివాస జాస్తీ
4. శ్రీవీణ కొడాలి
5. శ్రీ పల్లవి
6. సోమేశ్వర్ కొమురవెల్లి
7. శశాంక్ సాగర్
8. సతీష్ చుక్కపల్లి
9. సాత్విక్ బుదాటి
10. పూర్ణచందర్ రావు
11. ప్రహ్లాద్
12. పార్వతీ బుదాటి
13. మీరాన్ మహ్మద్
14. శ్రీకాంత్ కొంగర
15. జగపతి రావు వీరమాచినేని
16. అక్షయ్ రెడ్డి
17. అంటోనీ రెడ్డి
18. అమరేశ్వర్ రావు
బిజెనెస్ చేయడం తప్పు కాదు. కానీ, ఒక కంపెనీలో వసూలు చేసిన డబ్బులు మరో కంపెనీలో వాడుకోవడం తప్పు. తమ చేతిలో అధికారం ఉందని కుట్ర పూరితమైన మోసాలకు పాల్పడం నేరం. ఆ ఆలోచనతోనే అన్ని కార్యక్రమాలు కానిచ్చారు. కానీ, ఈడీ నోటీసులతో వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని భయం గుప్పిట్లో ఉన్నారు.
తొలివెలుగు కథనాలతో తారుమారు
ఎంతో జల్సాగా అత్తారింటికి వెళ్లినట్లు జైలుకెళ్లి రావడమే అనుకున్న లక్ష్మీ నారాయణ అండ్ కో కి తొలివెలుగు కథనాలు మింగుడు పడటం లేదు. వెయ్యి కోట్ల చీటర్స్ కి తొలివెలుగు క్రైంబ్యూరో కథనాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చని అనుకున్న వారికి ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇబ్బందిగా మారాయి. ఈడీ వద్ద పక్కా సమాచారం ఉండటం.. అది అందరికీ బహిర్గతం కావడంతో ఏం జరగబోతుందోనని భయంగా బతుకుతున్నారు.
కంపెనీలు ఇవే!
ఒక్క సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్ ఇండియా పేరుతోనే మోసాలు, చీటింగ్ లు జరగలేదు. వేరే కంపెనీల పేర్లతో భారీగా దోచేశారు. సాహితీ ఓర్చిడ్స్ ఇన్ప్రా టెక్ ఎల్ఎల్పీ, ల్యూసెంట్ లైఫ్ సైన్స్, ఆనంద్ సాహితీ సివిల్ కన్ స్ట్రక్షన్ ఎల్ఎల్పీ, శౌవిక్ కన్ స్ట్రక్షన్, అసితా డెవలపర్స్, హండ్రెడ్ హెల్తీ ఇయర్స్, సాహితీ టెక్ సొల్యూషన్స్, సిరి స్కై స్కాపర్స్ ఎల్ఎల్పీ, మేవెంట్రన్ సొల్యూషన్స్, సౌగాంధీకా ఫామ్స్ అండ్ రెస్టారెంట్స్, హల్సియోన్ బిల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, సాహితీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఇండియా, మైస్టిక్ వెల్నెస్ ఇంటర్నేషనల్ వ్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి పైన విచారణ జరగాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
రాజీనామా చేసిన డైరెక్టర్స్ మరిన్ని కంపెనీలు పెట్టేసి అక్కడకు డబ్బులు తరలించినట్లు తెలుస్తోంది. 900 కోట్ల స్కాం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. కోటి రెండు కోట్లు తినేసినంత మాత్రాన.. ఆ చీటర్స్ ని కాపాడాలనుకోవాలనుకుంటే.. ఆ తిండి వెనుక ఎంతమంది అమాయకుల కష్టం ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.