రాజకీయాల్లో లక్ష్మీ పార్వతి కాస్త సంచలనం. సీనియర్ ఎన్టీఆర్ కు భార్యగా ఆమెకు ఎంత ఇమేజ్ వచ్చిందో అన్నే ఇబ్బందులు కూడా పడ్డారు. ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ చితా భస్మాన్ని తాను దాచుకున్నానని చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకుని కావేరి నదిలో కొంత కలిపానని హరిద్వార్ లో కొంత కలిపానని వివరించారు.
తన గురించి ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. లారీలలో తెచ్చిన పట్టుబట్టలు, బుట్టల్లో నగలు ఉన్నాయని ప్రచారం చేశారని అన్నారు. ప్రేమతో, అభిమానంతో ప్రేమించి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లానని వివరించారు. సీనియర్ ఎన్టీఆర్ కు ఆరోగ్యం బాలేని పరిస్థితులలో ఆయనను నడిపించుకున్నానని గుర్తు చేసుకున్నారు. తాము ఇద్దరం ఎన్నికల కోసం వెళ్లామని అప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చిందన్నారు ఆమె.
తమ వివాహం తర్వాత ప్రజలు 222 సీట్లు ఇచ్చారని తెలిపారు. తమ పెళ్లైన రోజు నుంచి పిచ్చిపిచ్చి కార్టూన్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. వంశోద్దారకుడు విషయంలో నేను, నా భర్త నిర్ణయాలు తీసుకున్నామని వాటిని బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నందమూరి వంశం పూర్తిస్థాయిలో స్వీకరించలేదన్నారు ఆమె. తాను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఎత్తుకున్నానని గుర్తు చేసుకున్నారు. తల్లిని, పిల్లవాడిని ఇంటికి పిలిపించి జూనియర్ ఎన్టీఆర్ తల్లికి పట్టుచీర, పిల్లాడికి డ్రెస్ తెప్పించానని, నాన్నా నువ్వు రోజూ రా నాన్నమ్మ తాతయ్య ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పానని తెలిపారు.