ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదన్నారు వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని, ఎన్టీఆర్ టీడీపీ పూర్తి బాధ్యతలు తీసుకోవాలన్నారు. క్యాన్సర్ డే సందర్భంగా లక్ష్మీ పార్వతి ఒమేగా హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనరల్ చెకప్ కోసం వచ్చానని, క్యాన్సర్ కి ఎవరూ భయపడవద్దన్నారు.
అనంతరం రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కూడా జగన్ లాగానే ఐదేళ్ల పాటు జనంతో మమేకమవ్వాలన్నారు. అలా అయితేనే టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. ఏపీలోకి బీఆర్ఎస్ వచ్చినా వీఆర్ఎస్ కావడమేనని.. ప్రజాకర్షణ లేని వాళ్లే చంద్రబాబు లాగా పొత్తులు పెట్టుకుంటారన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందన్నారు లక్ష్మీపార్వతి. అప్పుడు పోలీసులంతా చంద్రబాబు చేతిలోనే ఉన్నారని.. ఈ కేసును అప్పుడు సీబీఐకి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివేకా హత్య కేసులు సీబీఐకి ఇచ్చారని.. దీన్ని బట్టి ఈ కేసులో వ్యవహారంలో ఎవరు సిన్సియర్‌గా ఉన్నారో అర్థం అయిపోతుందన్నారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది. మళ్లీ తెలుగు దేశం పార్టీని బతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు రావాల్సిందేనని చర్చ సాగుతూ ఉంది. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.