– జీవో నెంబర్ 1 సరైనదే..
– కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు మంచిదే
– జగన్ ప్రభుత్వ పనితీరు బాగుంది
– మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
ఏపీలో జీవో నెంబర్ 1పై పెద్ద గొడవే జరుగుతోంది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఈ జీవోపై మండిపడుతున్నాయి. భోగి సందర్భంగా పార్టీలు జీవో కాపీలను మంటల్లో వేసి తగులబెట్టాయి. అయితే.. వైసీపీ శ్రేణులు బద్ధ శత్రువుగా భావించే మాజీ జేడీ లక్ష్మీనారాయణ జీవో నెంబర్ 1కు మద్దతుగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రోడ్ల మీద సభలు, రోడ్ షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేసిన ఈ జోవో మంచిదేనన్నారు లక్ష్మీనారాయణ. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే ఆనందంగా ఉందన్న ఆయన.. ప్రభుత్వ పనితీరు బాగుందని ఆకాశానికెత్తేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని కూడా సందర్శించారు లక్ష్మీనారాయణ.
కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదన్న ఆయన.. జగన్ సీఎం అయిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం శుభపరిణామం అని కొనియాడారు.
ఒకప్పుడు జగన్ జైలుకు వెళ్లడంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారు. వైసీపీ శ్రేణులు ఈయన పేరెత్తితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అలాంటిది ఈయన జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయింది. గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేసిన ఓడిన ఈయన.. తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలి కాలంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే.. జగన్ ప్రభుత్వంపై తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.