ఈమధ్యే డ్రగ్స్ ఓవర్ డోస్ తో చనిపోయిన విద్యార్థి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కీలక సూత్రధారి లక్ష్మిపతిని నార్కోటిక్స్ వింగ్ అరెస్ట్ చేసింది. ఇతను హాష్ ఆయిల్, గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు.
బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా లక్ష్మిపతి వ్యాపారం కొనసాగుతోంది. ఏజెన్సీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్, గంజాయి తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నాడు. ఏడేళ్లుగా డ్రగ్స్ కు బానిసైన అతను.. దాన్నే వ్యాపారంగా సాగిస్తున్నాడు
ఇటీవల డ్రగ్స్ కు బానిసైన బీటెక్ విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టడంతో నల్లకుంటలో ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి దొరికాడు. అతని నుంచి కూపీ లాగగా.. డ్రగ్స్ వాడుతున్న ముగ్గురి వివరాలు తెలిశాయి. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇక కీలక సూత్రధారి లక్ష్మిపతి.. ప్రేమ్ ఉపాధ్యాయ్ కు స్నేహితుడు. ఈ కేసులో మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు లక్ష్మీపతికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.