కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగుతానని ఆయన హెచ్చరించారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
తనను చట్టం నుంచి తప్పించుకున్న వ్యక్తిగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏ కారణాలతో తనను పరారీలో వున్న వ్యక్తి అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
తాను గతంలో ఎప్పుడూ దోషిగా నిర్ధారించబడలేదన్నారు. అందుకే తాను ఓ సాధారణ పౌరుడినన్నారు.ఇదంత ప్రతి పక్షాల కక్ష సాధింపు చర్య అని ఆయన పేర్కొన్నారు. తాను విదేశాలకు పారిపోయానని ఎవరు పడితే వారు, రాహుల్ గాంధీ అనుచరులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు వరకు తాను దోషినని ఏ న్యాయస్థానమైనా తీర్పు నిచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. పప్పు అలియాస్ రాహుల్ గాంధీ లాగా కాకుండా తాను ఓ సాధారణ పౌరుడనని చెప్పారు. ప్రతిపక్ష నేతల్లో అందరికీ వేరే పని ఏమీ లేదన్నారు. వారికి కూడా సరైన సమాచారం లేకపోవచ్చు లేదా కేవలం కక్ష సాధించేందుకే ముందడుగు వేస్తుండవచ్చు అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగాలని తాను నిర్ణయించుకున్నానన్నారు. ఆయన స్పష్టమైన సాక్ష్యాధారాలతో రావాల్సి వుంటుందని తాను స్పష్టంగా చెప్పగలనన్నారు. రాహుల్ గాంధీ తనను తాను పరిపూర్ణ మూర్ఖుడిగా చేసుకోవడాన్ని తాను చూడాలనకుంటున్నానన్నారు.