ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్య మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. గర్బంతో ఉన్న తన కోడల్ని దాడుల సమయంలో సుమారు 15 గంటల పాటు ఒకే చోట కూర్చుని ఉండేలా ఈడీ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఫైర్ అయ్యారు.
సంఘ్ పరివార్ (ఆర్ఎస్ఎస్), బీజేపీపైనా తాను సైద్దాంతిక పోరాటాన్ని గతం నుంచి చేస్తున్నానన్నారు. భవిష్యత్ లోనూ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. తాను బీజేపీ ముందు తల వంచబోనన్నారు. బీజేపీ రాజకీయాలకుతమ కుటుంబ సభ్యులు లొంగిపోరన్నారు.
తాను ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను కూడా చూశానని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను పోరాటం కూడా చేశానన్నారు. బీజేపీ ప్రభావంతో ఈడీ తన కూతుళ్లు, చిన్న మనవరాళ్లు, గర్భవతి అయిన కోడలును నిరాధారమైన, ప్రతీకార కేసుల్లో 15 గంటల పాటు కూర్చోబెట్టిందన్నారు.
ఓ వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ఇంత దిగజారిపోతుందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రతి పక్షలను ఇబ్బంది పెడుతూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం నీచమైన ప్రయత్నం చేస్తోందన్నారు.