దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు రూ. 60లక్షల రూపాయల జరిమానాను కోర్టు విధించింది.
ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 15న ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. అయితే అప్పుడు ఆయనకు ఎలాంటి శిక్షను కోర్టు విధించలేదు. తాజాగా ఆయనకు శిక్షను ఖరారు చేస్తు కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.
దాణా కుంభకోణానికి సంబంధించి గతంలో దుమ్కా, డియోఘర్, చాయ్ బాసా ట్రెజరీల కేసుల్లో ఆయనను కోర్టు దోషిగా నిర్దారించింది. దీంతో ఆయనకు 14 ఏండ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.
దాణా కుంభకోణంలో మొదటి సారిగా ఆయన 30 జూలై 1997లో మొదటిసారిగా జైలుకు వెళ్లారు. సుమారు 134రోజుల పాటు జైలులో ఆయన ఉన్నారు. కేసులో శిక్షను కోర్టు సోమవారం ఖరారు చేస్తుందని తెలియడంతో ఆయనకు ఆదివారం నుంచి బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగినట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు జరిగిన విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు.