మాజీ మంత్రి, బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. మండల్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన లాలూ… అవినీతి వ్యవహారంలో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడటంతో రాంఛీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లాలూ పరిస్థితి విషమంగా మారుతుండటంతో భార్య రబ్రీదేవి, కొడుకు తేజస్వీ యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే, తన ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తున్న నేపథ్యంలో లాలూను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని తేజస్వీ… జార్ఖండ్ సీఎం సోరెన్ కు కలవనున్నారు.
దాణా కుంభకోణంలో జైలు శిక్ష ఎదుర్కొంటున్న లాలూను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో అప్పటి వరకు రాంఛీ ఆసుపత్రిలోనే అత్యున్నత చికిత్స అందేలా సహాయం చేయాలని సీఎంను కలుస్తానని తేజస్వీ ప్రకటించారు.
లాలూకు గతంలోనే గుండె ఆపరేషన్ కాగా, కిడ్నీలు కేవలం 25శాతమే పనిచేస్తున్నాయి. ఇప్పుడు న్యూమెనియా తరహాలో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తోంది. 2017 డిసెంబర్ నుండి లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.