ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు తేజస్వి యాదవ్ ప్రకటన చేశారు. లాలూ ఆరోగ్యం మెరుగువుతోందని వెల్లడించారు. పట్నా హాస్పిటల్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా వైద్యుల పర్యవేక్షణలో లాలూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
లాలూ ప్రసాద్ ఢిల్లీ ఎయిమ్స్ కిడ్నీ, ఆర్థో, కార్డియాక్ విభాగాల వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. కిడ్నీ, గుండె, రక్తపోటు, మధుమేహం సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంటెన్సివ్ కేర్‌లో వైద్యుల పర్యవేక్షణలో లాలూ ఉన్నారన్న తేజస్వీ.. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
ఆదివారం తన నివాసంలోని మెట్లపై నుంచి జారిపడటంతో లాలూ ప్రసాద్ కుడి భుజం ఎముకలు విరిగి గాయాలయ్యాయి. పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను.. బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్‌లో అత్యవసర చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అంతేకాకుండా లాలూ కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం కోర్టు నుంచి సైతం అనుమతి తీసుకున్నారు.
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఫిబ్రవరి 21న తీర్పునిచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు.