ల్యాండ్స్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీలోను, మరికొన్ని చోట్ల జరిపిన దాడుల్లో తన అక్కలు, చెల్లెళ్ళు, వారి బంధువులకు చెందిన జువెల్లరీని కూడా స్వాధీనం చేసుకున్నారని బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. దాడుల్లో వీటిని రికవరీ చేసినట్టు చెప్పుకుంటూ ఫోటోలు తీసి సర్క్యులేట్ చేశారని ఆయన అన్నారు. , పైగా తమకు రూ. 600 కోట్ల ఆస్తులున్నాయని వారు చేసిన ప్రకటన అర్థ రహితమని ఆయన చెప్పారు.
గత వారం ఢిల్లీ లోని తమ ఇంట్లో అరగంటలోనే సోదాలు ముగించినా.. పై అధికారుల నుంచి తమకు అనుమతి రావలసి ఉందంటూ గంటల తరబడి ఇంట్లోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇది తమను వేధించడం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. తాము బీజేపీ-ఆర్ఎస్ఎస్ లాంటి వారం కామని, రియల్ పాలిటిక్స్ ని పాటించేవారమని, ప్రజలకు తమపై నమ్మకం ఉందని అన్నారు.
కానీ వారు రాజకీయ రణక్షేత్రం నుంచి భయపడి పారిపోయే రకమని తేజస్వి యాదవ్ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం నుంచి ఇటీవల తాము లెక్కల్లో చూపని కోటి రూపాయలను, 600 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది.
ఈడీతో బాటు సిబిఐ కూడా ఈ నెల 4 న లాలూ ప్రసాద్ కి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన వారి ముందు హాజరు కాలేదు. ఆర్జేడీకి చెందిన ఇతర నేతల ఇళ్ళు, కార్యాలయాలపై కూడా ఈడీ వరుసగా దాడులు నిర్వహించింది.