భూమి సర్వే చేయడానికి వచ్చిన హెచ్ ఎండిఏ అధికారులపై భూకబ్జాదారులు దాడికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 725/21,23,24 లలో 108 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉండగా ఈ భూమిని ప్రభుత్వావసరాల కోసం గతంలో భూసేకరణ చేశారు. అప్పటి నుంచి ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
అయితే, ఈ భూమిని హెచ్ఎండీఏ అధికారి ఎడీ సర్వే చేయడానికి సైట్ వద్దకు రాగా.. అక్కడ ఆ భూమిని ఆక్రమించిన కొంత మంది రేకులతో ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అధికారులు రేకులను తొలగించి కబ్జా దారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈక్రమంలో భూకబ్జాదారులు, అధికారులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో భూ కబ్జాదారులు అధికారులపై రాళ్లతో దాడి చేసి జేసీబీలను పగులకొట్టారు. హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాస్తు చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై హెచ్ఎండీఏ అధికారులను వివరణ కోరగా.. వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ.. విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. మరో వైపు స్థానికులు భూకబ్జాదారుల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జా చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.