-వెంచర్ లో ప్లాట్లు చేసి విక్రయం
– మళ్లీ వ్యవసాయ భూమి పేరిట రిజిస్ట్రేషన్
– అధికార పార్టీ నేతలతో రెవెన్యూ అధికారుల కుమ్మక్కు
– లబ్దిదారుల ఆందోళన
మహబూబ్ నగర్ జిల్లాలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ధరణిలోని లొసుగులను వాడుకుని కబ్జాదారులు భూకబ్జాకు పాల్పడ్డారు. 30 ఏండ్ల క్రితం ఫ్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేసిన ఘటన జడ్చర్ల పట్టణంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే…. కర్నూల్‌కు చెందిన కొంత మంది వ్యాపారస్తులు గతంలో జడ్చర్ల శివార్లలో సర్వే నం. 41,42,43 లో సుమారు 14 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దాన్ని వెంకటాద్రి వెంచర్స్ పేరిట స్కీం పద్దతిలో ప్లాట్ల అమ్మకాలు చేశారు. అందులో 25 ఏండ్ల క్రితమే 1000కి పై చీలుకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు.
కాలం గడిచే కొద్ది భూమి విలువ కూడా పెరిగింది. దీంతో రెవెన్యూ అధికారులతో కొంత మంది అధికార పార్టీ నాయకులు కుమ్మక్కయ్యి ఆ భూమిని వ్యవసాయ భూమిగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్లాట్లు కొన్న లబ్దిదారులు ఆరోపించారు.
రాత్రికి రాత్రే 2 ఎకరాల భూమిలో చెట్లను తొలగించారని, మళ్లీ దాన్ని వెంచర్‌గా మార్చే ప్రయత్నాలు చేశారని లబ్దిదారులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ రిజిస్ట్రేషన్ విషయంలో రెవెన్యూ శాఖకు భారీగా ముడుపులు అందివుంటాయని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారో అందరికి అర్థమవుతోందని వారు చెబుతున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.