– సీలింగ్ భూములపై టీఆర్ఎస్, ఎంఐఎం గద్దలు
– చక్రం తిప్పుతున్న ఎంపీ, మంత్రి కుమారుడు?
– బలహీనులే టార్గెట్ గా బరితెగింపు
– మేయర్ విజయలక్ష్మి కబ్జా బాగోతం బట్టబయలు
– రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రెచ్చిపోతున్న మాఫియా
– తొలివెలుగు క్రైంబ్యూరో దగ్గర పక్కా ఆధారాలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:తెలంగాణ అంతా నిజాం భూములే. రాచరికపు వ్యవస్థను కూలగొట్టి 70 ఏళ్లు దాటింది. సీలింగ్, కౌలుదారు చట్టం ప్రకారం రైతులకే భూములు చెందాలి. కానీ, తమ పేరు మీద వందల ఎకరాలు ఉందని టీఆర్ఎస్, ఎఐఎం నేతలు గద్దల్లా వాలి పీక్కు తింటున్నారు. 50 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలపై కోర్టు ఆర్డర్లు అంటూ.. అధికార బలంతో పొజిషన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కోట్ల రూపాయల భూములను పది, పాతిక లక్షలు ఇస్తాము వెళ్లిపోండి అంటూ బేరసారాలకు దిగుతున్నారు. ఈ మాఫియా ఇప్పుడు మహేశ్వరం, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా తిరుగుతోంది.
మేయర్ విజయలక్ష్మి కబ్జా కహానీ!
పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో 10 ఎకరాల భూమి తమదేనని కబ్జా బాగోతానికి తెర లేపారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి. సర్వే నెంబర్ 20లో రాములమ్మ అనే దొరసానికి చెందిన భూస్వామి భూములు ఉండేవి. కౌలుదారు చట్టం ప్రకారం 32 ఎకరాలు రైతులకు పట్టాలు ఇచ్చారు. మరికొంత భూమిని ప్రభుత్వం సేకరించినప్పుడు వాళ్ల వారసులకు డబ్బులు చెల్లించి పేద ప్రజలకు అమ్మకం జరిపింది. సీలింగ్ యాక్ట్ ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు భూములను పంచేశారు. కానీ, 2007లో అప్పటి ఎమ్మార్వో మహాలక్ష్మి రికార్డులు పరిశీలించకుండానే వారసత్వంగా రాములమ్మ కుమారుడికి పట్టా చేసి ఇచ్చారు. అదే భూమిని కేకే కుమారుడు వెంకటేశ్వరరావు బదలాయించుకున్నారు. ఈ భూమి వివాదంలో ఉండగానే సుల్తాన్ పూర్ రైతు ప్రశాంత్ రెడ్డి హత్య జరిగింది. భూముల రేట్లు పెరగడంతో ఇప్పుడు మళ్లీ మాఫియా ఎంటర్ అయింది. అధికార బలంతో మళ్లీ పొజిషన్ తీసుకునేలా ప్లాన్ వేసి.. గన్ తో బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్ చొరవ చూపించి తమ భూమిని కాపాడాలని వేడుకుంటున్నారు.
కొంగర్ ఖుర్ద్ లో 600 ఎకరాలు
ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న.. 600 ఎకరాలపై గులాబీ, ఆకుపచ్చ లీడర్ల కన్నుపడింది. ఆ ఊరు రెవెన్యూ అంతా వక్ఫ్ భూములే. రైతులు 60 ఏండ్లుగా దున్నుకుంటున్నారు. అయితే.. వక్ఫ్ భూములు, సీలింగ్ యాక్ట్ కి విరుద్ధంగా వారసులకు ఇచ్చేయొచ్చని నిర్ణయాలు తీసుకున్నారంటూ.. అవి తమ తాతలవని ఊర్ల మీద పడుతున్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ భూములను నిజాం వారసులకు కట్టబెట్టేందుకు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు 5 ఏండ్లుగా ఒకే సీఐ కొనసాగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఉద్యమాలు చేసినా తమ భూమి దక్కుతుందనే నమ్మకం లేకుండా పోయిందని చెబుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన నాయకులే భూ మాఫియా వైపు ఉండటంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. భూముల రేట్లు ఆకాశాన్ని తాకడంతో.. ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ సైతం ఈ భూములు వారివే అంటూ.. తరిమివేసేలా వ్యవహరించడంపై అనేక లంచాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ భూ మాఫియా బాలాపూర్ మండలంలో ఓ వక్ఫ్ బోర్డు భూమిని క్లియర్ చేసుకుని ఇప్పుడు కొంగర్ ఖుర్ద్ పై పడిందని అంటున్నారు. ప్రస్తుతం 8 సర్వే నెంబర్లలో 600 ఎకరాలకు కోర్టు తీర్పులంటూ.. కబ్జాలకు పాల్పడుతున్నారు.
రైతులకు తెలియకుండానే ఎక్స్ పార్టీ తీర్పులు తెచ్చుకున్న తీరు.. వక్ఫ్ బోర్డు భూములు అంటూ గెజిట్ విడుదల చేసి ఆ తర్వాత నిజాం వారసులకు కట్టబెడుతున్న వైనంపై తొలివెలుగు క్రైంబ్యూరో పక్కా ఆధారాలతో త్వరలో కథనాలు ఇవ్వబోతోంది.