కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగలేదన్నారు రైతు ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దేశినేని హనుమంతరావు. శుక్రవారం హన్మకొండ హరితహోటల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు నేతలు హాజరై మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రాష్ట్రంలో ఎక్కడా చేపట్టకుండా శాశ్వతంగా పరిష్కరించడం కోసం జీవో 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశినేని హనుమంతరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 6 కోట్ల గజాలు, 2 లక్షల 50 వేల ప్లాట్స్ చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ జనాభాలో తల ఒకటి కొన్న ఇంకా 69 వేల ప్లాట్స్ మిగిలిపోతాయన్నారు. 27 గ్రామ పంచాయతీల పరిధిలో 22వేల ఎకరాల భూముల సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వరంగల్ లో మొదలైన రైతు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం కాకూడదనే ఉద్దేశంతోనే ల్యాండ్ పూలింగ్ ను నిలిపివేసినట్లుగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. 80జీవో రద్దుకు ఈనెల 17 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామన్నారు. ఈలోగా రద్దు చేయకుంటే రైతు ఉద్యమం కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ప్రైవేటు కంపెనీలు చేస్తున్న సర్వేను అడ్డుకున్న రైతులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు రైతు ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బుద్దె పెద్దన్న. దొంగ సర్వేలు ఎందుకు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ను నిలదీస్తే.. అలాంటిది ఏమి లేదని రైతులను మభ్యపెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఖజానా లేకపోతే రైతులు భిక్షాటన చేసి డబ్బులు ఇస్తామని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏమైనా రియలేస్టేట్ బ్రోకర్లా..? అంటూ ప్రశ్నించారు. ఒక్కో ఎమ్మెల్యేకు వందల, వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. జీఓ 80 రద్దు చేయకపోతే ప్రజలే బుద్ది చెప్తారన్నారు పెద్దన్న.
రాష్ట్ర ప్రభుత్వం రైతుకులీలను వంచిస్తోందని ఆరోపించారు రైతు ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొమ్మినేని రవిందర్ రెడ్డి. రైతులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు చుపించకుండా భూమి లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తాం అని మంత్రి అనడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. రైతులు తమ ఉనికిని కోల్పోయేలా రాక్షస క్రీడ సాగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రింగ్ రోడ్డు పేరు చెప్పి రైతుల భూములను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పెరుమాండ్ల గూడెం రైతులను థర్డ్ డిగ్రీ తో పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారని మండిపడ్డారు రవిందర్ రెడ్డి.