– గులాబీల కడుపు నింపే క్రమబద్దీకరణ!
– రెగ్యులరైజ్ చేసి పార్టీలో చేరికలు
– కబ్జాల లిస్టులో మంత్రులు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ లు!
– పేదోడికి అందని ద్రాక్షలా అసైన్డ్ క్రమబద్దీకరణ
– భూములతోనే పాలిటిక్స్ నడిపిస్తున్న గులాబీ పార్టీ
– తొలివెలుగు క్రైం బ్యూరో పరిశోధనాత్మక కథనాలు
– ఖమ్మం జిల్లా బడాబాబుల బాగోతం పార్ట్ -1
తమకు అనుకూలంగా ఉంటేనే భూముల క్రమబద్దీకరణ.. ప్రతిపక్షంలో ఉండి అవసరం అయితే పార్టీ మారాల్సిందే. ఇవన్నీ కాదు ఎప్పుడంటే అప్పుడు పార్టీకి డబ్బులు ఇస్తాం అంటే అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఎవరికైనా కట్టబెట్టే వైఖరితో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. 2014 డిసెంబర్ లో జారీ చేసిన జీవో 58, 59కు అనుగుణంగా భూముల అసైన్ మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం దరఖాస్తులకు గడువు పెంచుతూ జీవో 14ను తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే.. దీని వెనక చాలా కుట్రలు దాగి ఉన్నాయని తేలింది. పక్కన ప్రభుత్వ భూమితో కలిసి ఉంటే చాలు నాయకులు రిజిస్ట్రేషన్ విలువ కట్టి కబ్జా చేసిన ఎంత భూమినైనా క్రమబద్దీకరించుకునేందుకు చూస్తున్నారు. పేదోడి పేరు మాటున బడా బాబులకు భూమి దారాదత్తం చేస్తున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ బాగోతం..!
మంత్రి పువ్వాడ అజయ్.. తన మెడికల్ కాలేజ్ కోసం కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయించుకున్నారు. క్విడ్ ప్రో కో పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా 2016 ఏప్రిల్ లో టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అందుకు మమత ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం పువ్వాడ జయశ్రీ(అన్న భార్య) పేరు మీద ఖమ్మం పట్టణంలో 93, 94 సర్వే నెంబర్లలో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ భూమి విలువ దాదాపుగా అప్పట్లోనే రూ.70 కోట్లు. ఇప్పుడు రూ.200 కోట్లు పెట్టినా దొరకదు. అసలు రెగ్యులరైజ్ చేసుకుంది 10 వేల 489 గజాలు మాత్రమే. ఇందుకోసం మమత సొసైటీ ప్రభుత్వానికి చెల్లించింది కేవలం రూ.58 లక్షలే. అయితే.. అక్కడ అంతకుమించి ప్రభుత్వ భూమి ఉంది. అది నాలుగు ఎకరాల వరకు ఉంటుంది. ఇప్పటి రెగ్యులరైజేషన్ పేరుతో పక్కనే ఉన్న వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని మళ్లీ రెగ్యులరైజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ తెచ్చిన 59 జీవో ప్రకారం నగర ప్రాంతాల్లో 500 గజాలకు మించి రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. అయితే అజయ్ టీఆర్ఎస్ లో చేరడానికి బేరం కుదుర్చుకుని ఈ ల్యాండ్ రెగ్యులరైజ్ కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేక జీవో ఇచ్చింది. 2015లో అప్పటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ దివ్య వద్ద రెగ్యులరైజ్ చేయించుకుని ఆ తర్వాత 2016 ఏప్రిల్ లో టీఆర్ఎస్ లో చేరారు పువ్వాడ అజయ్.
హైకోర్టులో పిటిషన్.. ఇంకా తేల్చలేదు..!
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువల కోసం రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే.. ఖమ్మం నగరంలో ఇప్పుడు సాగు భూములు లేనందున కాలువలు అవసరం లేదని ప్రాజెక్ట్ ఇంజనీర్లు వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో రైతుల నుంచి సేకరించిన భూములను వారి వారసులకు ఇవ్వాలే తప్ప.. కార్పొరేట్ శక్తులకు ఇవ్వరాదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఉంది. ఇదే అంశంపై సుధాకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపైన 2016లో వాదనలు జరిగాయి. ప్రభుత్వానికి, మమత ఎడ్యుకేషనల్ సొసైటీకి నోటీసులు అందాయి. అయినా ఇప్పటికీ ఇంకా సాగుతునే ఉంది. ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్న వారికి భూమిని పంచేసింది. హైదరాబాద్ బాచుపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవని టౌన్ ప్లానింగ్ అదికారి నోటీసులు జారీ చేస్తే.. మూడు నెలల్లోనే బదిలీ చేయించారని తెలుస్తోంది. ఇలా మంత్రి భూదాహం జీవో 59 తీర్చనుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే భూములు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలా ఖమ్మంలో ఐదుగురి నాయకుల భూములు క్రమబద్దీకరణ పేరుతో ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ లో ఉంది. వీటిన్నంటినీ రాబోయే ఎలక్షన్స్ కోసం వాడుకొని క్రమబద్దీకరించే అవకాశాలు ఉన్నాయి.
చట్టాలు ఎన్ని వచ్చాయో.. అన్నీ వారికి వరం..!
1995 నుంచి ప్రభుత్వ, యూఎల్సీ భూముల్లో కబ్జా చేసి ఉన్నవారికి క్రమబద్దీకరిస్తూనే ఉన్నారు. మొదటగా 508 జీవోతో ప్రారంభమైన ప్రస్థానం.. జీవో 747, 1606, 674, 455, 615, 1601, 2004 వరకు వచ్చాయి. వైఎస్ ప్రభుత్వం 166 తీసుకొచ్చింది. కేసీఆర్ సర్కార్ 58, 59 జీవోలు విడుదల చేసింది. అయితే.. 2016లో ఈ జీవోల కంటే ముందే.. 166 ప్రకారం టీఆర్ఎస్.. ఓ మాజీ డీజీపీకి బంజారాహిల్స్ లోని ప్రైం ఏరియాలో రెగ్యూలరైజ్ చేసింది. ఇలా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ తొలివెలుగు క్రైంబ్యూరో రాబోయే కథనాల్లో బయటపెడుతుంది. అయితే.. 59 జీవో కూడా సంపన్నులకు వరంలా మారింది. ఖజానా కోసం 250 గజాల పైన ఉన్నా.. ప్రభుత్వ రేటు చెల్లించి భూమిపై హక్కులు పొందవచ్చని చెప్పడంతో ఎకరం స్థలం ఉన్నా.. రాజకీయనాయకులు ఫీజులు చెల్లించి క్రమబద్దీకరించుకున్నారు. కాలేజీ పేరుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి 3 ఎకరాలు కబ్జా చేశారు. 166 జీవో కింద దరాఖాస్తు చేసుకుంటే.. 59 జీవో కింద రెగ్యూలరైజేషన్ చేశారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి చెందిన బడాబాబుల ఫైల్స్ 500 పైగా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త కబ్జాలతో కూడుకుని ఉంది కాబట్టే జీవో 14 ఇచ్చారు.
జిల్లాలవారీగా క్రమబద్దీకరణపై జరుగుతున్న వ్యవహారాలపై తొలివెలుగు వరస కథనాలు ఇవ్వనుంది. పేదోడికి కేటాయించిన అసైన్డ్ భూములను మాత్రం అమ్ముకొనివ్వకుండా.. దళిత, గిరిజనుల భూములను బడాబాబులకు ఎలా దోచిపెడుతున్నారో క్రైం బ్యూరో కళ్లకు కట్టేలా చూపించనుంది.