అక్రమ వెంచర్లకు, అక్రమ భూ దందాలకు మేడ్చల్ జిల్లా అడ్డాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజా ప్రతినిధుల అండదండలు.. అధికారుల లాలూచీ తత్వంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పటేల్ పట్వారీ నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతవో కొట్టురా మొగడా.. అంటూ రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్నారు కొందరు. మంత్రే మనదిక్కున్నడు ఇగ మనకేం భయం అని అందినకాడికి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు… దస్త్రాలతోటి అసలు పనే లేదు. అమాయకులు కనపడితే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. ప్లాట్లు అప్పనంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
మేడ్చల్ మండల పరిధిలోని గౌడవెళ్లి గ్రామం రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉంది. రోడ్డు రాకతో ఒక్కసారిగా గ్రామంలోని భూములకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు స్వర్గధామంగా మారింది. గోదాములు వెంచర్లకు అనువుగా ఉండడంతో బడా బడా.. స్థిరాస్తి వ్యాపార సంస్థలు సైతం తరలి వస్తున్నాయి. రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో పెట్టుబడి పెట్టేందుకు సామాన్య జనం నుంచి వ్యాపారులు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే అక్రమార్కులకు వరంగా మారింది. అందిందే అదునుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
గౌడవెల్లి గ్రామం సర్వే నెంబర్ 556లో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్ చేసి ప్రహరీని నిర్మించారు. అంతేకాకుండా 346, 347 సర్వే నెంబర్లలో ఉన్న సుతారిగూడెం చెరువు శిఖం కూడా కబ్జా చేశారు. ఐకానా వెంచర్ యాజమాన్యం అనుమతుల కోసం హెచ్ఎండీఏకు వెళ్ళింది. అయితే నిర్ణీత సమయంలో వెంచర్ పూర్తి చేయకపోవడంతో హెచ్ఎండీఏ ఆ ఫైల్ ని క్లోజ్ చేసింది. కానీ యాజమాన్యం మాత్రం యథావిధిగా పనులు నిర్వహిస్తోంది. రిలయన్స్ గ్యాస్ పైప్ లైన్ మీదనే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయమై సర్పంచ్‌కి, కార్యదర్శికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పలువురు వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికాలు జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.