ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరణి అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధరణి పోర్టల్ తో ఎదురవుతోన్న సమస్యలపై ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైందన్నారు.
ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఇతర నేతలు పాల్గొన్నారు. ఉత్పత్తి రంగం కొద్ది మంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి ఉంటుందని భట్టి చెప్పారు.
గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉండేదని.. కాంగ్రెస్ పేద ప్రజలకు భూమిని పంచిన చరిత్ర కూడా కాంగ్రెస్ దేనని ఆయన చెప్పారు. తెలంగాణలో ఏ పోరాటం చేసినా.. భూమి కోసం జరిగినదేనని భట్టి అన్నారు. స్వతంత్ర భారతదేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు. ఇక తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారని.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని జైరాం రమేశ్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో.. మీ భూమి.. మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలో ధరణిలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలున్నాయని తెలిపారు. ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు.. ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సర్వే చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు..30 వేల జీవోలున్నాయని.. కానీ మేము ఓకే చట్టం తీసుకొస్తామన్నారు.