తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమం భూమి సమస్యలను పరిష్కరించకపోగా…సమస్యను మరింత జటిలం చేసింది. అరెకరమో, ఎకరమో ఉన్న భూమిని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ ఆ భూమిపైనే బతికే పేద రైతులకు నోటి కాడి బుక్క లేకుండా చేసింది. అటు రైతులు …ఇటు రెవెన్యూ సిబ్బంది ప్రాణాల మీదికి తెచ్చింది. భూ ప్రక్షాళక కార్యక్రమం తమకున్న కొద్దిపాటి భూమిని కూడా లేకుండా చేసిందిని నిరుపేదలు లబోదిబో మంటున్నారు. మా తాతలు, తండ్రుల నుంచి సాగుచేసుకుంటున్న భూమిని భూ ప్రక్షాళనలో భాగంగా సరైన కాగితాలు లేవంటూ ప్రభుత్వం గుంజుకొని పెద్దలకు కట్టబెడుతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రోజూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని, తమ చేతుల్లో ఏమి లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు రెవెన్యూ సిబ్బందిపై కక్ష పెంచుకొని దాడులకు దిగుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కూడా ఈ నేపధ్యంలోనే జరిగింది. తాము భూములు కోల్పోవడానికి ప్రభుత్వ భూప్రక్షాళనే కారణమని తెలుసుకుంటున్న బహుజనులు భూ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దాదాపు మూడు లక్షల పై చిలుకు బాధితులకు అండగా నిలబడి పోరాడేందుకు తెలంగాణ భూ పరిరక్షణ సమితి ఏర్పాటైంది. రైతుల కోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 6 వ తేదీ లోగా బాధితుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది. డెడ్ లైన్ వరకు ప్రభుత్వం ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకపోతే డిసెంబర్ ఏడో తేదీన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని భూ పరిరక్షణ సమితి తెలిపింది.