ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పాయి. రాజధాని కొలంబోలో నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. ఈక్రమంలోనే అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారిపోయారు. దీంతో అధ్యక్ష భవనంతో పాటు, ఆయన పరిపాలనా భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించారు. వారిని అదుపు చేయడంలో ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తేశారు.
ఇటు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేట్ నివాసానికి నిప్పంటించారు. ప్రధానిగా ఆయన రాజీనామా నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించినా.. వారిని దాటుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. ప్రధానికి చెందిన కొన్ని వాహనాలను సైతం ధ్వంసం చేశారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో గత మార్చి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు గోటబయతో పాటు అప్పటి ప్రధాని మహింద్రా రాజపక్సలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆ సమయంలో మహింద్రా తప్పుకోగా.. ఆయన స్థానంలో రణిల్ మే12న అధికారం చేపట్టారు. ఆయన పాలనలో పరిస్థితి చక్కబడుతుందని అనుకుంటే.. మరింత దిగజారింది. దీంతో ఈయన కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ రాజీనామా ప్రకటనతో ప్రజల్లో ఒక్కసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తొలుత వేలాది మంది అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని ఇంటికి నిప్పుపెట్టారు.