జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో టెర్రరిస్టులను ఉక్కుపాదంతో అణచేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జమ్మూకాశ్మీర్ పోలీసులు ఐదుగురు ముష్కరులను ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నారు. వీరిని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో హైగాం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత బలగాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం, కశ్మీర్ పోలీసులు కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదుల మాడ్యూల్ ను ఛేదించారు. ముగ్గురు టెర్రరిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే మారణహోమం సృష్టించేందుకు, గ్రెనేడ్ల దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇటీవల నాన్ లోకల్ కార్మికులను చంపడం, వివిధ ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి అలజడి సృష్టించడం వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందనే విషయం విచారణలో తేలిందన్నారు. పండ్ల తోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి మూడు చైనీస్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గందేర్ బల్ ప్రాంతంలో కూడా ఒక స్కార్పియో వాహనంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అలాగే, బారాముల్లా జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్కో టెర్రర్ మాడ్యూల్ ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. అక్కడ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.5 కోట్ల విలువ చేసే హెరాయిన్ తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై యూఏపీ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.