మునుగోడు ఉప ఎన్నికలో దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) బలపర్చిన స్వతంత్య్ర అభ్యర్థిగా పుట్టపాక గ్రామానికి చెందిన ఏర్పుల గాలయ్యను బరిలో నిలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు నామినేషన్ వేయడానికి చండూరులో భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ పాల్గొన్నారు.
తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక అంకంలోని కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చండూరులోని రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో శుక్రవారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు మొత్తం వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
ఇతర ప్రాంతాల నుంచి సైతం కొందరు అభ్యర్థులు ఇక్కడి వచ్చి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది.నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంది. శనివారం నుంచి నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం నవంబర్ 3వ తేదీన పోలింగ్, 6న కౌంటింగ్ జరగనుంది.