తాలిబాన్ల రాజ్యస్థాపనకు ఏర్పాట్లు జరుగుతుండటంతో ఆప్ఘాన్ వాసులు తలోదిక్కు పారిపోతున్నారు. వారి నియంత్రణలోకి వెళ్తే మళ్లీ నరకంలోకి వెళ్లినట్టేనని.. సొంతగడ్డపై మమకారాన్ని చంపుకుని ఇతరదేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. అలాంటిది ఓ హిందూ పూజారి మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలి వెళ్లనంటే వెళ్లనని భిష్మించుకుకూర్చున్నాడు. ముస్లింల పాలనలో ముస్లింలకే రక్షణ ఉండదనే భయంతో అంతా నిష్క్రమిస్తోంటే పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం అక్కడే ఉండిపోతానని అంటున్నాడు. కాబూల్‌లోని రత్తన్‌నాథ్ ఆలయంలో పూజరిగా పనిచేస్తున్న ఇయన.. చావైనా,బతుకైనా అక్కడేనని తెగేసి చెబుతున్నాడు.
స్థానిక హిందూ సంస్థల ప్రతినిధులు.. తమ సొంత ఖర్చులతో ఆప్ఘాన్ నుంచి బయటపడేందుకు ఏర్పాట్లు చేస్తామని, సురక్షితంగా తీసుకెళ్తామని చెబుతున్నా వద్దని చెబుతున్నాడు రాజేశ్ కుమార్. తన పూర్వీకులంతా ఆ ఆలయంలోనే వందల ఏళ్ల పాటు సేవలు అందించారని.. తన జీవితం కూడా అక్కడే ముగియాలని అంటున్నాడు. ఒకవేళ తాలిబాన్లు తనను చంపినా.. అది దేవుని సేవగానే భావిస్తానని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజేశ్ కుమార్ మొండి పట్టుదల చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ తాను కొలిచే దేవుని కోసం ప్రాణాలనే పణంగా పెట్టాలనుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ దేవుడు కచ్చితంగా కాపాడతాడని, కాపాడాలని ప్రార్థిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్‌లోని కల్లోల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత్ ఉదారంగా వ్యవహరిస్తోంది. ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసాను అందించి.. ఆఫ్ఘాన్ శరణార్థులను దేశంలోకి వచ్చేందుకు అనుమతినిస్తోంది.